షణ్ముఖునికి తమిళనాట ఆరు ప్రముఖమైన క్షేత్రాలున్నాయి. వాటిలో ఒకటి – ఈ తిరుచెందూరు. 2000 ఏళ్ళ చరిత్ర గల ఈ పుణ్య క్షేత్రం, సముద్రాన్నానుకొని ఉండడం గమనించదగ్గ విశేషం. సముద్ర కెరటాలు తిన్నగా వచ్చి గుడిని తాకుతుంటాయి.
తిరుచెందూరు
స్థల పురాణం
ఒకానొకప్పుడు, ఈ పవిత్ర స్థలంలో అసురుడైన శూరపద్ముడు – తన సోదరులగు సింహముఖుడు మరియూ తారకులతో ముల్లోకాలను ఏలుతుండేవాడు. ఆరు ముఖాలతో ఆర్ముగం, షణ్ముఖుడు అని పిలువబడే సుబ్రహ్మణ్యస్వామి వారు, కైలాసం నుండి తిరుచెందూరుకు – అసుర సంహారమునకై దిగి వచ్చారు. తన శివారాధన నిమిత్తం, మయుడిని రప్పించి ఒక దేవాలయాన్ని నిర్మించమని ఆఙ్ఞాపించారు. ఆ తరువాత స్వామివారు అసురసంహారానికై పూనుకొని, వారితో ఆరు రోజులు ఎడతెఱిపి లేకుండా నేలపైన, సముద్రముపైన, ఆకాశములో యుద్ధం చేశారు. ఆ భీకర యుద్ధంలో శూరపద్ముడు మినహా అందరూ సంహరింపబడ్డారు. శూరపద్ముడు సముద్రానికి దగ్గిరలో ఒక మామిడి చెట్టు రూపంలో ఉద్భవించాడు. స్వామివారు ఇంద్రుడిని తన వాహనముగా చేసుకొని, ఆ రాక్షసుడితో వాడి నివాసంలోనే ఎదిరించి పోరాడి, చివరికి రెండు ముక్కలుగా చీల్చి ఆ రక్కసుని సంహరించారు. కానీ ఆ రెండు ముక్కలు కోడిపుంజు, మగ నెమలిగా మారి స్వామివారితో తలపడ్డాయి. ఇలా చివరివరకూ పోరాడిన ఆ రాక్షసుడు స్వామివారిచే క్షమింపబడి, ఆయన విశ్వరూప దర్శన భాగ్యాన్ని పొందాడు. ఇంద్రుడి బదులు ఆ మగ నెమలిని తన వాహనంగా చేసుకొని, కోడిపుంజును తన పతాక చిహ్నముగా చేసుకున్నారు.
ఆలయ శోభ
సమీపిస్తున్న కొద్దీ, భవ్యమైన తొమ్మిదంతస్తుల రాజగోపురం, దాని పైని శూలం – కొట్టొచ్చినట్లుగా కనబడుతాయి. దీనిని 300 ఏళ్ళ క్రితమే నిర్మించడం జరిగింది. తిరువాదుథురై మఠ మహా సన్నిధానానికి చెందిన దేశికమూర్తిస్వామివారికి కలలో – ఈ నిర్మాణం చేపట్టవలసినదిగా ప్రచోదనమయ్యింది. కానీ ధనమేమో లేదాయె. ఎలాగో పని మొదలు పెట్టించి, కూలీలకు రోజువారీ భృత్యంగా విభూతిని పంచేవారు. ఆ కూలీలు తుండుక్కై వినాయక ఆలయం వద్దనుండి వెళుతున్నపుడు, ఎవరి శ్రమకు తగినట్టుగా వారికి – ఆ విభూతి బంగారంగా మారిపోయేదట. ఆరవ అంతస్థు పూర్తికాగానే, ఈ అద్భుతం ఆగిపోయిందట. మరలా సుబ్రహ్మణ్యస్వామివారు కలలో కనిపించి, కల్యాణ పట్టణానికి చెందిన సీతాపతి మరైక్కార్ అను పోషకుడి వద్దనుండి ఒక బుట్ట ఉప్పును పొందమని ఆదేశించారట. ఆ బుట్టతో చిరుచెందూరూ చేరుకోగానే, ఉప్పు కాస్తా బంగారు నాణాలుగా మారి – మిగతా మూడంతస్థుల నిర్మాణం పూర్తిగావించడానికి తోడ్పడిందట.
భవ్యమైన తొమ్మిదంతస్తుల రాజగోపురం
దేవాలయ ప్రధాన మంటపం 124 స్థంబాలతో శోభిస్తూ, దక్షిణాభిముఖంగా ఉంటుంది. దీనిని షణ్ముఖ విలాసం అని పిలుస్తారు. మొదటి ప్రాకారపు దక్షిణ ప్రవేశమార్గానికి పడమటివైపు దక్షిణామూర్తి (శివుడు) కనిపిస్తారు. పడమటి ద్వారానికి ఉత్తరాన శూరపద్మునితో పోరాటానికి సిద్ధంగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామివారు, నెమలిపై కూర్చొనున్న విగ్రహం కనిపిస్తుంది. అక్కడక్కడా శివలింగాలు కనిపిస్తాయి. ఆ తరువాత, అరుణగిరి నాథర్ ముని విగ్రహం ఉంటుంది. ఈయన స్వామివారిని స్తుతిస్తూ తిరుప్పుగయ్ అనే రచన చేశారు. ఉత్తర ద్వారం వద్ద వేంకటేశ్వరస్వామివారి విగ్రహం కనిపిస్తుంది. ఆనుకొనున్న గుహలో గజలక్ష్మి, పరుండిన రంగనాథుడు, శ్రీదేవీ, భూదేవీ, నీలాదేవి దర్శనమిస్తారు. ఇక్కడే రాతిలో చెక్కిన పన్నెండు ఆళ్వారుల (వైష్ణవ భక్తాగ్రేసరులు) మూర్తులు కూడా దర్శనమిస్తాయి.
షణ్ముఖ విలాసం
తూర్పు వాకిలి మధ్యభాగంలో ధ్వజస్తంభం కనిపిస్తుంది. రెండవ ప్రాకారంలో, కుమార పీటంకార, ఆయన భార్యలు, షణ్ముఖుని ఉత్సవ విగ్రహాలూ ఉంటాయి. దగ్గిరలో 63 నాయన్మార్లు (శైవ భక్తాగ్రేసరులు) వరుసగా దర్శనమిస్తారు. ఉత్తరపు వాకిలిలో, శివాలయాలలో ఉన్నట్టు – చిటికెల చండీశ్వరమూర్తి కనిపిస్తారు. అలాగే, తూర్పున నటరాజస్వామి, శనీశ్వరుడు, భైరవ మూర్తులు దర్శనమిస్తాయి. తూర్పు వాకిలి మధ్య భాగంలో, బంగారు ధ్వజ స్థంభం ఉన్నది.
మూల విరాఠ్ – పవిత్ర పూజ్య పీఠం
పూజ్య పీఠ ప్రవేశ ద్వారం వద్ద వీర బాహు, వీర మహేంద్రులనబడే ద్వార పాలకులు, స్వామివారి రక్షక భటులుగా నిలబడి కనిపిస్తారు. ఒకే ముఖముతో, చతుర్భుజుడై మూలవర్ (మూల విరాఠ్) బాల సుబ్రహ్మణ్య స్వామివారిగా దర్శనం ఇస్తారు. ఇది బ్రహ్మచారి స్వరూపం. ఈ క్షేత్ర ప్రాశస్త్యం, వైభవాలు ఎంతగా ప్రభావితం చేసినా, స్వామివారి దర్శనం చేసినపుడు మాత్రం ఒక వింత అనుభవం కలుగకమానదు. భయంకరమైన రక్కసులను సంహరించినా, స్వామివారి సుందర విగ్రహం, ఒక బాలకుడిలా ఎంతో ముద్దుగొలుపుతూ ఉంటుంది. రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టాలనే వాంఛకన్నా, దగ్గిరకెళ్ళి బుగ్గగిల్లాలనిపిస్తుంది – అంత అద్భుతంగా ఉంటారీ స్వామివారు. ముఖ్యంగా మన తెలుగువాళ్ళకు – చూడగానే బెజవాడ కనకదుర్గమ్మ మోము గుర్తుకు వస్తుంది. అమ్మవారిని చూస్తే చేతులు కైమోడ్చి నమస్కారం చేయాలనిపించినా, ఇక్కడ మాత్రం ఈయన బుగ్గ గిల్లాలనిపిస్తుంది.
తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి
ఉత్తరపు దిక్కున ఒక మూలలోగల శివలింగమే, శూరపద్ముని సంహారం తరువాత, సుబ్రహ్మణ్య స్వామివారు పూజించినదని చెబుతారు. స్వామివారి ప్రసాదం విభూతి. ప్రధాన పీఠానికి ఎడమవైపున ఉత్తరాన ఉత్సవ విగ్రహాలైన శెంథిల్ నాయకన్, తన భార్యలతో కూడి దర్శనమిస్తారు. ఈ ఉత్సవ మూర్తులకు ఎడమ వైపు బొక్కసం (ఆభరణాలు భద్రపరుచు స్థలం) ఉంటుంది.
మరొక ప్రత్యేక స్తానంలో, దక్షిణాభిముఖంగా షణ్ముఖస్వామి తన భార్యలగు వల్లి, దేవసేనలతో వేంచేసి ఉన్నారు. ఈ అందమైన రాగి విగ్రహం అద్భుతమైన ఆభరణాలతో సుశోభితంగా ఉంటుంది. స్వామివారు పన్నెండు చేతులతో అనేకమైనట్టి ఆయుధాలు చేతబూని ఉంటారు.
పురాణ విగ్రహం
షణ్ముఖ విగ్రహానికి సంభందించిన చారిత్రక గాధ ఒకటి ఉన్నది. క్రీ.శ. 1648 లో డచ్ దేశస్తులు ఆలయంపై దాడి చేసి, మూలవిరాఠ్, నటరాజ విగ్రహాలను, సంపదనూ దొంగిలించి సముద్ర మార్గంగుండా పారిపోయారు. కానీ ఒక భయంకరమైన తుఫానులో చిక్కుకొని, భయానికిలోనయి ఆ విగ్రహాలను అక్కడే సముద్రంలో జారవిడిచి తోక ముడిచారు. దొంగతనం గురించి తెలుసుకున్న వడమలయప్ప పిల్లయన్, వెంటనే పంచలోహాలతో మునుపటి విగ్రహంలాంటిదే మరొకటి తయారు చేయించారట. ఈయన నాయకన్లచే నియమింపబడిన జమిందారు. కానీ, క్రీ.శ. 1653 లో ఈ నూతన పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించే సమయానికి, ఒకనాడు స్వామివారు ఆయనకు కలలో దర్శనమిచ్చి, సముద్రంలో జారవిడిచిన తన నిజ విగ్రహాన్ని వెతికి తెచ్చి, తిరిగి ప్రతిష్టించమని ఆఙ్ఞాపించారు. సముద్రంలో నిమ్మపండు తేలియాడుతున్నచోట, దానిపై గరుడపక్షి వలయాకారంలో తిరుగుతూ కనిపిస్తుందని – ఆనవాళ్ళు తెలిపారు. నిర్దేశం ప్రకారం వెతికి, స్వామివారి నిజమూర్తిని కనుగొని, పునః ప్రతిష్ట గావించాడా జమిందారు. కొత్తగా చేయించిన పంచలోహ విగ్రహాన్ని, మురుగన్ కురుచిలో తిరుప్పిరంటీశ్వరాలయంలో ప్రతిష్టించారు. ఇదేదో కట్టు కథ అనుకునేరు! M.Raffel అనే ఫ్రెంచ్ దేశస్తుడు, 1785లో తను ప్రచురించిన పుస్తకంలో, డచ్ సైనికుడు ఒకడు తెలిపిన వివరాలను పొందుపరిచాడు. ఆ వివరణ, ఈ దోంగతన సంఘటనతో సరితూగుతున్నదట.
నాయిక్కనర్ వింత బావి
షణ్ముఖ విలాస్ ఎదురుగా, ఒక దారి కనబడుతుంది. ఆ దారిగుండా వెళితే, చివరన ప్రవేశ రుసుము చెల్లించి బావిలోకి దిగే మార్గంగుండా వెళితే, ఈ నాయిక్కనర్ చేరుకుంటాము. సాధారణంగా భక్తులు – మొదట సముద్రంలో స్నానం చేసిన తరువాత, ఈ బావిలో స్నానమాచరించి, పొడి బట్టలు ధరించి, స్వామివారి దర్శనానికి వెళుతుంటారు.
నాయిక్కనర్ చేరుకునే దారి
బావిలోకి దిగే దారి
ఈ కుండాన్ని, తన వేలాయుధంతో సుబ్రహ్మణ్యస్వామివారు స్వయంగా సృష్టించారని ప్రతీతి. ఇదో అర్థంకాని వింత. ఇలాంటి వింత మరొకటి – విల్లొండి తీర్థం పేరుతో రామేశ్వరంలో కూడా ఉన్నది. వివరాలకు ఈ లంకే చూడండి.
సముద్రాన్ని ఆనుకొని ఉన్నా, నీరు తాగడానికి అనువుగా ఉంటుంది. అంతే కాదు, ఈ బావిలో నీరు – రెండు రకాలుగా ఉంటుంది. మొత్తంగా వ్యాపించి ఉన్న నీరు గంధకం వాసనతో, కాస్తంత ఉప్పగా మురికిగా కనిపిస్తుంది. ఒక మూలకు ఉన్న మరో చిన్ని కుండం 7 అడుగుల లోతు, ఒక అడుగు వేడల్పు కొలతలతో ఉంటుంది. దీనినుండి ఊరే జలం ఉప్పగా ఉండదు. దీనినే నాయిక్కనర్ అంటారు. సరైన నామం స్కంద పుష్కరిణి. ఇందులో స్నానం – ముఖ్యంగా పిల్లల స్నానం ఎంతో ప్రసిద్ధి. ఆ చిన్న కుండం నుండి నీరు తోడి భక్తుల స్నానానికి సహాయంగా, ఒక దేవస్థాన ఉద్యోగి ఉంటాడు.
నాయిక్కనర్
స్కంద పుష్కరిణి
ఈ క్షేత్రం ఎక్కడుంది?
రామేశ్వరానికి వెళ్ళిన మేము, కన్యాకుమారికి వెళుతుంటే, మా డ్రైవరు – ఈ క్షేత్రం గురించి చెప్పాడు. పెద్దగా వివరాలేవీ తెలియదు. దారిలోనే కదా అని వెళ్ళాము. కానీ వెళ్ళిన తరువాత తెలిసి వచ్చింది – ఎంత అద్భుతమైన క్షేత్రమో. తమిళనాడు తూతుకుడి జిల్లాలో, తిరునళ్‌వేలికి 55 కిలోమీటర్ల దూరంలో, సముద్ర తీరాన ఉన్నదీ తిరుచెందూరు పట్టణం.
షడ్వక్త్రం శిఖివాహనం త్రిణయనం చిత్రామ్బరాలంకృతం శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ | పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దధానం సదా ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం స్కన్దం సురారాధితమ్ ||







